Narendra Modi: కాంగ్రెసేతర ప్రధానిగా... నరేంద్ర మోదీ మరో రికార్డు!
- వాజ్ పేయి రికార్డును దాటేసిన మోదీ
- ప్రధానిగా పదవిలో 2,269 రోజులు
- అత్యధిక కాలం పాలించిన నాలుగో ప్రధానిగానూ రికార్డు
ఇండియాలో అత్యధిక కాలం పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన తొలి కాంగ్రెసేతర వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవలి వరకూ ఈ రికార్డు మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి పేరిట ఉండగా, మోదీ దాన్ని సవరించారు. ఇదే సమయంలో ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉన్న నాలుగో ప్రధానిగానూ ఆయన నిలిచారు. ఈ విషయాన్ని తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రసార భారతి తెలియజేసింది.
భారత ప్రధానిగా తొలిసారి 2014, మే 26న తొలిసారి, ఆపై 2019లో మే 30న రెండోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. వాజ్ పేయి 2,268 రోజులు ప్రధాని పదవిలో ఉండగా, మోదీ దాన్ని నిన్నటితో దాటేశారు. ఇండియాను అత్యధిక కాలం పాటు పాలించిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ తొలిస్థానంలో ఉన్నారు. ఆయన 17 సంవత్సరాల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. ఆపై ఆయన కుమార్తె ఇందిరా గాంధీ 11 ఏళ్లు, మన్మోహన్ సింగ్ పదేళ్లు ప్రధానిగా పనిచేశారు. వారి ముగ్గురి తరువాతి స్థానానికి నరేంద్ర మోదీ చేరుకున్నారు.
కాగా, యూపీలోని రామ జన్మభూమిని సందర్శించిన తొలి భారత ప్రధాని కూడా నరేంద్ర మోదీయే కావడం గమనార్హం. ఇటీవల ఆయన, అయోధ్యకు వెళ్లి, రాముడిని దర్శించుకుని, ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రధాని హోదాలో పలువురు నేతలు అయోధ్యకు వెళ్లినప్పటికీ, అక్కడి వివాదం కారణంగా రామ జన్మభూమికి మాత్రం ఎవరూ వెళ్లలేదు.