Nizamabad District: రెండు కుటుంబాలను రోడ్డున పడేసిన ఫేస్‌బుక్ ప్రేమ!

Nizamabad man falls love with UP woman and kidnapped her son

  • యూపీ వివాహితతో నిజామాబాద్ యువకుడి ప్రేమాయణం
  • ప్రియురాలి సలహాతో ఆమె కుమారుడి కిడ్నాప్
  • సెల్‌ఫోన్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు

ఫేస్‌బుక్ ప్రేమ రెండు కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాహితతో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడికి ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం చివరికి నేరానికి పురికొల్పి యువకుడిని కటకటాలపాలు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్‌పూర్‌కు చెందిన యువకుడు అశ్వక్ (24)కు ఉత్తరప్రదేశ్‌లోని మురాలాబాద్ జిల్లాకు చెందిన వివాహిత (28)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది.

వివాహితతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన అశ్వక్ ఆమెను కలిసేందుకు పలుమార్లు మురాలాబాద్ వెళ్లాడు. ఈ సందర్భంగా తనను అక్కడి నుంచి తీసుకెళ్లిపోవాల్సిందిగా ఆమె అతడిని కోరింది. దీంతో తిరిగి నిజామాబాద్ చేరుకున్న యువకుడు ఆమెను తీసుకొచ్చేందుకు ప్లాన్ వేశాడు. జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తికి చెందిన ఓ వ్యక్తి నుంచి కారును అద్దెకు తీసుకుని ఈ నెల 5న ప్రియురాలు వద్దకు వెళ్లాడు.

అయితే, అక్కడికి వెళ్లాక మరో సమస్య వచ్చి పడింది. కలిసి జీవించేందుకు అవసరమైన డబ్బులు ఎలా? అన్న ప్రశ్న వారిని వేధించింది. దీంతో ప్రియురాలి సలహా మేరకు ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసి 40 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చాడు. అనంతరం ఆమె భర్తకు ఫోన్ చేసి కిడ్నాప్ విషయం చెప్పాడు. అడిగినంత సొమ్ము ఇవ్వకుంటే బాబు ప్రాణాలు తీస్తానని బెదిరించాడు.

దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని సదరు మహిళ ఫేస్‌బుక్ ప్రియుడికి చెప్పడంతో అతడు చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. మరోవైపు, కిడ్నాప్ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడి మొబైల్ నంబరు ఆధారంగా అతడిని గుర్తించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు నిన్న నిజామాబాద్‌లోని అతడి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. అలాగే, అతడు అద్దెకు తీసుకున్న కారును, దానికి డ్రైవర్‌గా వెళ్లిన ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం యూపీకి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News