AP High Court: రాజధాని తరలింపుపై 'స్టేటస్ కో'ను ఈ నెల 27వరకు పొడిగించిన హైకోర్టు
- వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను వ్యతిరేకిస్తూ పిటిషన్లు
- గతంలో స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు
- మరోసారి అదే నిర్ణయం
వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై వేసిన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. చట్టాల అమలుపై ఇచ్చిన స్టేటస్ కో (యథాతథ స్థితి)ని ఎత్తివేయాలని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది... 3 రాజధానులు అనేది విభజన చట్టానికి విరుద్ధమని కోర్టుకు విన్నవించారు. విభజన చట్టంలో ఒక్క రాజధాని ప్రస్తావనే ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో, తాము జారీ చేసిన స్టేటస్ కో ఉత్తర్వులను ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. కాగా, ఆన్ లైన్ విచారణలో పలు సమస్యలు ఉన్నాయని, తమ పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారణ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.
అయితే, ప్రభుత్వం తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది స్పందిస్తూ, కరోనా వ్యాప్తి కారణంగా నేరుగా హైకోర్టులో వాదనలు వినిపించలేమని, ప్రభుత్వం తరఫున డిల్లీ నుండి తన వాదనలు వినిపిస్తానని తెలిపారు.