Telangana: 28 ఎకరాల భూ వివాదం.. రూ.1.10 కోట్ల లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కీసర తహసీల్దార్

Keesara MRO arrested while taking bribe

  • ఇంత పెద్దమొత్తంలో తహసీల్దార్ లంచం తీసుకుంటూ పట్టుబడడం ఏసీబీ చరిత్రలోనే తొలిసారి
  • ప్రముఖ నేత అనుచరుడితోపాటు వీఆర్ఏ, దళారీ అరెస్ట్
  • తహసీల్దార్ ఇంటి నుంచి మరో రూ. 25 లక్షల స్వాధీనం

28 ఎకరాల వివాదాస్పద భూమిపై కొందరికి అనుకూలంగా పాసుపుస్తకాలు ఇప్పించేందుకు ఏకంగా రూ. 1.10 కోట్లు లంచంగా తీసుకున్న కీసర తహశీల్దార్‌ నాగరాజ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ తహసీల్దార్ ఈ స్థాయిలో లంచం తీసుకుని పట్టుబడడం ఏసీబీ చరిత్రలో ఇదే తొలిసారి. బాధితులు ఫిర్యాదు చేయకుండా నేరుగా ఏసీబీ అధికారులే తహసీల్దార్‌ను పట్టుకోవడం విశేషం. ఈ కేసులో ఓ ప్రముఖ నేత అనుచరుడు, మరో మధ్యవర్తి, వీఆర్ఏను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలో ఓ కుటుంబానికి పూర్వీకుల నుంచి 44 ఎకరాలకుపైగా భూమి సంక్రమించింది. 1996లో ఇందులో 16 ఎకరాల భూమికి సంబంధించిన హక్కులను ఆ కుటుంబానికి కల్పిస్తూ అప్పటి ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మిగతా 28 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉండగా, అక్కడి భూమి ధరలకు అమాంతం రెక్కలు రావడంతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వీటిపై కన్నేసింది.

ఆ భూములను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న సదరు సంస్థ ఆ భూములు తమకు దక్కేలా చేయాలంటూ ఓ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి అనుచరుడు, కీసరకు చెందిన అంజిరెడ్డి, ఉప్పల్‌కు చెందిన దళారీ శ్రీనాథ్‌లను పురమాయించింది.

వివాదాస్పద భూమికి సంబంధించి తప్పుడు పత్రాలతో పాసు పుస్తకాలు ఇస్తే రూ. 1.10 కోట్లు ఇస్తామంటూ వారు కీసర తహసీల్దార్ నాగరాజ్‌ను ఆశ్రయించారు. కళ్లు చెదిరే మొత్తం ఇస్తామని చెప్పడంతో నాగరాజ్ మరోమాటకు తావులేకుండా సరేనన్నాడు. దీంతో  నిన్న సాయంత్రం అంజిరెడ్డి, శ్రీనాథ్‌లు ఆఫర్ చేసిన మొత్తం సొమ్ముతో నాగరాజ్ ఇంటికి చేరుకున్నారు.

అప్పటికే నాగరాజ్‌పై నిఘా పెట్టిన అధికారులు కాపుకాశారు. డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్ నాగరాజ్‌, అంజిరెడ్డి, శ్రీనాథ్‌లతోపాటు రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. లంచంగా తీసుకున్న రూ. 1.10 కోట్లతోపాటు నాగరాజ్ ఇంటి నుంచి మరో రూ. 25 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News