Sadhineni Yamini: యామిని మీద కేసు మంచిది కాదు.. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి: సోము వీర్రాజు
- అయోధ్య భూమిపూజను ప్రసారం చేయని టీటీడీ
- సర్వత్ర వెల్లువెత్తుతున్న విమర్శలు
- విమర్శించిన యామినిపై కేసు నమోదు
అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని భారత్ తో పాటు మరెన్నో దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే, టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ మాత్రం ప్రసారం చేయలేదు. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ నాయకురాలు సాదినేని యామిని ప్రస్తావిస్తూ టీటీడీపై విమర్శలు గుప్పించారు. దీంతో, ఆమెపై టీటీడీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయోధ్యలోని రామాలయం శంకుస్థాపన శతాబ్దాల కల అని వీర్రాజు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోని 250 ఛానల్స్ ప్రత్యక్షప్రసారం చేశాయని తెలిపారు. కానీ, కలియుగ దైవం అయిన శ్రీవెంకటేశ్వరస్వామి యొక్క టీటీడీ ఛానల్ ప్రసారం చేయలేదంటే... ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలచుకుంటేనే మనసుకి బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే ఈ అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు. యామిని మీద కేసు పెట్టడం మంచిది కాదని... ఈ కేసును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.