Hussain Sagar: ప్రమాదకర స్థాయికి చేరిన హుస్సేన్‌సాగర్ నీటిమట్టం.. ఆందోళనలో ప్రజలు!
- గత వారం రోజులుగా వర్షాలు
- నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్
- 513.41 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం
గత వారం రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పట్టణాలన్నీ జలసంద్రమయ్యాయి. హైదరాబాద్ నగరం కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. సాగర్ నీటి ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా... ప్రస్తుత నీటి మట్టం 513.58 మీటర్లకు చేరుకుంది. దీంతో తూము ద్వారా జీహెచ్ఎంసీ లేక్స్ అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టే వదులుతున్నప్పటికీ నీటి మట్టం పెరుగుతూనే ఉంది.
సాగర్ క్యాచ్ మెంట్ ఏరియా 240 చదరపు కిలోమీటర్లు కాగా... ఈ ప్రాంతం మొత్తాన్ని వర్షం ముంచెత్తుతోంది. సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, నగరంలో వర్షం తగ్గుముఖం పట్టిందని... అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెపుతున్నారు.