RIL: అనిల్ అంబానీ బకాయిలు ముఖేశ్ అంబానీ ఎందుకు కట్టకూడదు?: సుప్రీంకోర్టు

Mukesh Ambani May Pay Brother Dues to Telecom

  • డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికంకు రూ. 31 వేలకోట్లు బకాయిపడిన ఆర్ కామ్
  • నాలుగేళ్ల క్రితం దాదాపు ఉచితంగా సంస్థను విలీనం చేసుకున్న రిలయన్స్
  • అప్పటి నుంచి స్పెక్ట్రమ్ ను వాడుకుంటున్న రిలయన్స్ జియో
  • ప్రభుత్వ ఆస్తులు వాడినందుకు బకాయిలు ఎందుకు కట్టకూడదన్న  న్యాయస్థానం

అనిల్ దీరూభాయ్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికంకు బకాయి పడిన రూ, 31 వేల కోట్లను ముఖేశ్ అంబానీ ఎందుకు చెల్లించకూడదని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివాదాస్పద టెలికం ఏజీఆర్ (అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ) విషయంలో అనిల్ సంస్థ ఆర్-కామ్ భారీ బకాయిలు ఉందన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆర్-కామ్ గతంలో పొందిన స్పెక్ట్రమ్ ను రిలయన్స్ జియో 2016 నుంచి వాడుకుంటోంది. ఈ సంస్థను దాదాపు ఉచితంగా ముఖేశ్ అంబానీ విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇటీవల రిలయన్స్ జియోలో కొంత వాటాను విక్రయించగా, సుమారురూ. 1.50 లక్షల కోట్లు వచ్చాయి. ఫేస్ బుక్, గూగుల్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు పెట్టుబడులను పెట్టాయి. టెలికం శాఖకు చెల్లించాల్సిన బకాయిలపై సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు విచారణకు రాగా, కట్టాల్సిన డబ్బును ముఖేశ్ అంబానీ చెల్లించాలని న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ రెండు కంపెనీల మధ్యా తరంగాల పంపిణీ విషయంలో కుదిరిన ఒప్పంద పత్రాలను వెంటనే కోర్టు ముందు ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం, కంపెనీని విలీనం చేసుకున్న వారు బకాయిలను చెల్లించాలని పేర్కొంది. స్పెక్ట్రమ్ ప్రభుత్వ ఆస్తని, అదేమీ ప్రైవేటు పరం కాదని, దాన్ని వాడుకుంటున్న వారు అందుకు తగిన పన్నులను చెల్లించాల్సిన బాధ్యతను కలిగివుండాలని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేసు తదుపరి విచారణ తేదీలోగా, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం, తన వద్ద బకాయిలకు సంబంధించిన దస్త్రాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.

కాగా, ఏజీఆర్ డ్యూస్ కింద వోడాఫోన్ ఇంకా రూ. 50,399 కోట్లు, భారతీ ఎయిర్ టెల్ రూ. 25,976 కోట్లను చెల్లించాల్సి వుంది. ఈ కంపెనీలు తమ బకాయిలను చెల్లించేందుకు 15 సంవత్సరాల సమయాన్ని కోర్టు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో దివాలా తీసిన టెలికం సంస్థలైన ఆర్-కామ్, వీడియోకాన్, ఎయిర్ సెల్ తదితరాలు చెల్లించాల్సిన బకాయిలను కూడా వసూలు చేయాలన్నది టెలికం శాఖ ఆలోచన.

  • Loading...

More Telugu News