USA: నేనొస్తే దేశాలవారీ వీసాల కోటా రద్దు, గ్రీన్ కార్డుల సత్వర జారీ: ఇండియన్స్ కు జో బైడెన్ శుభవార్త!

Biden Good News for Indian Comunity

  • వీసా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తా
  • కుటుంబ ఆధారిత వలస విధానానికి ప్రోత్సాహం
  • ఇండియన్ అమెరికన్స్ ను దృష్టిలో పెట్టుకుని కీలక ప్రకటన

దేశానికి అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం తనకు ఇస్తే, హెచ్-1బీ వీసా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని డెమోక్రాట్ల తరఫు అభ్యర్థి జో బైడెన్ హామీ ఇచ్చారు. దేశాల వారీగా అమలవుతున్న కోటాను రద్దు చేసే దిశగా కృషి చేస్తానని అంటూ ఇండియన్స్ కు శుభవార్త చెప్పారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బైడెన్ ప్రచార బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఇండియన్స్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

కుటుంబ ఆధారిత వలస విధానానికి ప్రోత్సాహం ఇస్తానని హామీ ఇచ్చిన ఆయన, కుటుంబ ఏకీకరణకు మద్దతిస్తామని తెలిపారు. శాశ్వత వీసాల కోటాను గణనీయంగా పెంచుతామని స్పష్టం చేశారు. అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉండటంతో, నవంబర్ లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలంటే, వారి మద్దతు తనకు అవసరమన్న ఆలోచనలో ఉన్న బైడెన్, ఇప్పటికే భారత సంతతి మహిళ కమలా హారిస్ ను ఉపాధ్యక్ష పదవికి ఎంచుకున్న సంగతి తెలిసిందే.

హెచ్-1బీ వీసా విధానంలో అమెరికన్ కంపెనీలు, విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకుని వచ్చి, పని చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని, అన్ని కంపెనీలూ తక్కువ వేతనాలకు విదేశీయులను తెచ్చి, కాలం గడుపుతున్నాయన్నది ట్రంప్ అభిమతం. దీంతో ఆయన వీసా నిబంధనలను చాలా కఠినంగా మార్చివేశారు. ట్రంప్ నిర్ణయాలు భారత్, చైనా వంటి దేశాలపై అధిక ప్రభావాన్ని చూపాయి.

కాగా, డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడుతూ, ఇండియన్-అమెరికన్స్ కోసం ప్రత్యేక పాలసీ డాక్యుమెంట్ ను తయారు చేసి, విడుదల చేసిన తొలి వ్యక్తి బైడెన్ కావడం గమనార్హం. అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో సుమారు 13 లక్షల మంది భారత మూలాలున్న ఓటర్లు ఉన్నారు. వీరందరినీ ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని బైడెన్ విడుదల చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పీహెచ్డీ ప్రోగ్రామ్స్ చేసే గ్రాడ్యుయేట్లు, స్టెమ్ ఫీల్డ్ లో పనిచేసే వారిపై ఉన్న వీసాల పరిమితిని కూడా తొలగించే ఆలోచనలో బైడెన్ ఉన్నారని తెలుస్తోంది. నైపుణ్యవంతులైన ఉద్యోగుల కోసం తాత్కాలిక వీసా విధానాన్ని తీసుకుని వస్తామని, వీసాల సంఖ్యను పెంచుతామని, ఎన్నో భారత కుటుంబాలు దీర్ఘకాలంగా పడుతున్న సమస్యలను పరిష్కరిస్తామని, యూఎస్ లో శాశ్వతంగా ఉండి పనిచేసుకునే అవకాశాన్ని దగ్గర చేసే గ్రీన్ కార్డులను సత్వరమే జారీ చేసేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News