Italy: హృద్రోగ సమస్యలుంటే కొవిడ్ మరణాల ముప్పు: ఇటలీ శాస్త్రవేత్తలు
- మ్యాగ్నా గ్రేషియా యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
- గుండె సమస్యలున్న వారిలో ఆరోగ్యం విషమించే ప్రమాదం
- ఆసియా, ఐరోపా, అమెరికాకు చెందిన మొత్తం 77 వేల మందికిపైగా డేటా విశ్లేషణ
ఇటలీలోని మ్యాగ్నా గ్రేషియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనంలో కొవిడ్ గురించి మరో విషయం వెల్లడైంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ కొవిడ్ బారినపడిన వారిలో ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉందని, ఇటువంటి వారికి మరణం ముప్పు ఎక్కువని తేలింది. ఆసియా, ఐరోపా, అమెరికాలో కరోనా బారినపడి ఆసుపత్రి పాలైన 77,317 మందికి సంబంధించిన డేటాను విశ్లేషించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఓ నిర్ధారణకు వచ్చారు.
ఆసుపత్రిలో చేరే సమయానికి వీరిలో 12.89 శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, 36.08 శాతం మందిలో అధిక రక్తపోటు, 19.45 శాతం మందిలో డయాబెటిస్ ఉన్నట్టు తేల్చారు. మరికొందరిలో గుండెలో గాయాన్ని గుర్తించారు. బాధితుల్లో అప్పటికే ఉన్న గుండె సమస్యలు, హృద్రోగ ముప్పునకు దారితీసే అంశాలను బట్టి కరోనా మరణాలు ఉండొచ్చని అధ్యయనకారులు స్పష్టం చేశారు.