Sanchaita: చంద్రబాబు, లోకేశ్ నాపై దుష్టత్వాన్ని ప్రదర్శించడం మానుకోవాలి: సంచయిత
- మాన్సాస్ ట్రస్టు నేపథ్యంలో లోకేశ్ వ్యాఖ్యలు
- దిగజారారంటూ సంచయిత రిప్లయ్
- అశోక్ గజపతిపైనా విమర్శలు
మాన్సాస్ ట్రస్టు పరిధిలోని సంస్థల ఉద్యోగులు జీతాల్లేక వీధుల్లో భిక్షాటన చేస్తున్నాడంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి బదులిచ్చారు. మాన్సాస్ మరియ సింహాచలం దేవస్థానం ట్రస్టుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న మొట్టమొదటి మహిళపై చంద్రబాబు, లోకేశ్ తమ దుష్టత్వాన్ని ప్రదర్శించడం మానుకోవాలని హితవు పలికారు. హైదరాబాదులోని తమ విలాసవంతమైన భవనంలో నాలుగ్గోడల మధ్య కూర్చుని ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం నిలిపివేయాలని స్పష్టం చేశారు.
"ఇప్పుడు వారిద్దరూ మరికాస్త దిగజారారు. పార్టీ కార్యకర్తలకు మాన్సాస్ ఉద్యోగుల వేషం వేసి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. లోకేశ్ గారూ, అశోక్ గజపతి తాను చైర్మన్ గా వ్యవహరించిన కాలంలో తన నిర్వాకాలతో మాన్సాస్ సంస్థలను భ్రష్టు పట్టించారు. విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన రూ.20 కోట్లకు పైగా నిధులు 2016 నుంచి పెండింగ్ లో ఉంచారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబే. బకాయిలు వసూలు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అశోక్ గజపతి హయాంలో 2018-20 విద్యాసంవత్సరాలకు సంబంధించి ఏపీఎస్ సీహెచ్ఈ అనుమతి లేకుండానే బీకాం, బీఎస్సీ-ఎంపీసీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. ఆ డిగ్రీలు చెల్లని పరిస్థితిలో ఆ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారితే ఆ సమస్యను నేను చక్కదిద్దాను" అంటూ సంచయిత స్పష్టం చేశారు.