Hyderabad: హైదరాబాద్ లో పలు ప్రాంతాలు వరద నీటిలో... మోహరించిన హెలికాప్టర్లు!
- తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు
- పొంగి పొరలుతున్న వాగులు, వంకలు
- పలు జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీరు
- కట్టల నుంచి లీక్ అవుతున్న నీరు
- ప్రాణనష్టం జరుగకుండా చూడాలని కేసీఆర్ ఆదేశం
భారీ వర్షాలతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు, రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. గడచిన మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉండటం, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో,అత్యవసర తరలింపు నిమిత్తం హెలికాప్టర్లను సైతం సిద్ధం చేశారు.హైదరాబాద్ లో దాదాపు 600కు పైగా భవనాలు ముంపు ప్రాంతంలో ఉన్నాయని ఇప్పటికే గుర్తించిన అధికారులు, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఆదివారం నాడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్, వరద పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, సత్వరమే స్పందించి, ప్రాణనష్టం జరుగకుండా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇప్పటికే సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.
కాగా, నిన్న జయశంకర్ భూపాలపల్లిలో వరదలో చిక్కుకుపోయిన 12 మంది రైతులను కుందనపల్లి సమీపంలో హెలికాప్టర్ సాయంతో రక్షించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో రెండు కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామని, రెస్క్యూ ఆపరేషన్స్ కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశామని, అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ హై అలర్ట్ అమలవుతోందని అధికారులు తెలిపారు.
వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో జలాశయాలు పూర్తిగా నిండిపోయి, వరద ప్రవాహం అధికంగా ఉండటంతో కట్టలు తెగే ప్రమాదాన్ని ఊహించిన కేసీఆర్, అధికారులు అప్రమత్తంగా ఉండి, చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని జలాశయాల్లో నీరు లీక్ అవుతోందన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. కట్టల వద్ద నిరంతర నిఘా పెట్టాలని, వర్షాలు తగ్గే వరకూ అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు.