Ambati Rambabu: అందితే జుట్టు, అందకపోతే కాళ్లు... ఇదీ చంద్రబాబు నైజం: అంబటి రాంబాబు
- ఫోన్ ట్యాపింగ్ అంటూ మోదీకి లేఖ రాసిన చంద్రబాబు
- నాడు మోదీని చంద్రబాబు తిట్టలేదా? అని ప్రశ్నించిన అంబటి
- చంద్రబాబు ఎలాంటివాడో ప్రజలకు కూడా తెలుసన్న అంబటి
అధికార వైసీపీ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ఆ లేఖలో చంద్రబాబు మోదీ డైనమిక్ నాయకుడు అంటూ పేర్కొనడాన్ని అంబటి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాడు ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని నానా మాటలు అన్న చంద్రబాబు ఇవాళ ఆయనను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారని అన్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు.. ఇదీ చంద్రబాబు నైజం అంటూ విమర్శించారు.
"ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు ప్రధాని మోదీని ఏమన్నారో ఓసారి గుర్తుచేసుకోవాలి. భార్యను పాలించలేనివాడు భారతదేశాన్ని పరిపాలిస్తాడా? అని అన్నారు. నీకంటే నేను చాలా సీనియర్ ని, నువ్వు ప్రధానిగా ఉండడం వల్ల భారతదేశం అనేకవిధాలుగా అధోగతి పాలైంది... అంటూ మోదీపై లేనిపోని మాటలు మాట్లాడారు. మోదీ వ్యతిరేక శక్తులతో కలిసి మోదీని దింపేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబుకు ఇవాళ ఆయన నాయకత్వంపై ఇంత నమ్మకం ఎలా కలిగింది? అందితే జుట్టు, అందకపోతే కాళ్లు... చంద్రబాబు నైజం ఇదేనని మేం ఎప్పటినుంచో చెబుతున్నాం. ప్రజలందరికీ ఈ సంగతి తెలుసు. ఇలాంటి దౌర్భాగ్యమైన, చవకబారు రాజకీయాలు చేసేది చంద్రబాబే" అంటూ విమర్శించారు.
ఇక అసలు విషయానికొస్తూ, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు, సంఘ విద్రోహ శక్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తారని అన్నారు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కోరుతున్నారని, మరి, సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమని అన్నది చంద్రబాబు కాదా? అని అంబటి ప్రశ్నించారు.