KCR: అందరూ జాగ్రత్తగా ఉండాలి.. భద్రాచలంకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది: కేసీఆర్
- రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి బాగోలేదు
- కూలిపోయే పరిస్థితుల్లో ఉన్న ఇళ్లలో ఉండొద్దు
- రాష్ట్ర వ్యాప్తంగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేయండి
తెలంగాణలో వాతావరణ పరిస్థితి బాగోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతోందని... ఈ నేపథ్యంలో, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విన్నవించారు. కూలిపోయే పరిస్థితుల్లో ఉన్న ఇళ్లలో ఉండవద్దని హెచ్చరించారు. నీటి ప్రవాహాల్లోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. వర్షాలు ఇలాగే కొనసాగితే గోదావరికి వరద నీరు మరింత ఎక్కువగా వస్తుందని... భద్రాచలం పట్టణానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఇదే సమయంలో అధికారులకు కేసీఆర్ కీలక ఆదేశాలను జారీ చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ముంపు గ్రామాలను గుర్తించాలని ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. భద్రాచలంలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శిబిరాల్లో భోజన వసతి ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇదే సమయంలో బాధితులకు కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులు, శానిటైజర్లు అందించాలని తెలిపారు. అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు కూడా సహాయకచర్యలను పర్యవేక్షించాలని చెప్పారు.