Kanna Lakshminarayana: నా లేఖలోని అంశాలపై శ్రద్ధ వహించి వుంటే ఇప్పుడు ఆ గ్రామాలకు రక్షణ లభించేది: కన్నా లక్ష్మీనారాయణ
- ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు చేయాలన్న కన్నా
- ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్
- ఆదివాసీలకు హక్కులు ఇవ్వాలని విజ్ఞప్తి
ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ కు పోలవరం నిర్వాసితుల కడగండ్లపై గత నెల 20న లేఖ రాశారు. దానిని ఈ రోజు ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేస్తూ, నాటి లేఖలోని అంశాలపై ప్రభుత్వం శ్రద్ధ వహించి ఉన్నట్టయితే, ఇప్పుడు వస్తున్న ఆకస్మిక వరదల నుంచి పోలవరం పరిధిలోని గ్రామాలకు రక్షణ లభించి ఉండేదని కన్నా పేర్కొన్నారు.
ఇక ఆ లేఖలో పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆవాసాలను కోల్పోయిన ప్రజలు లక్షల్లో ఉన్నారని, ముఖ్యంగా ఆదివాసీలు, దళితుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయడంతో పాటు, ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం కావడం మరింత కలచివేస్తోందని పేర్కొన్నారు.
గతేడాది సాధారణ వరదలు వచ్చినప్పుడే 137 గ్రామాలకు ప్రజలకు పాక్షికంగా నిర్మాణం జరుపుకున్న కాఫర్ డ్యామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని కన్నా తన లేఖలో వివరించారు. దేవీపట్నంలో ఆ సమయంలో ఎనిమిది అడుగుల ఎత్తున నీళ్లు వచ్చాయని తెలిపారు. దేశంలో అత్యధిక సంఖ్యలో గిరిజనుల తరలింపుకు కారణమైన ఈ ప్రాజెక్టు అంశంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ప్రస్తుతం రానున్న వరదలనే కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్వాసితుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
- పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి. అర్హత ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో చేర్చాలి.
- అవకతవకల కారణంగా తొలగించిన పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చాలి.
- ఆదివాసీలందరికీ ఉచితంగా సాగు భూములు అందించాలి. వారికి కేటాయించిన పొలాలకు సమీపంలోనే నివాస గృహ కాలనీ కూడా ఏర్పాటు చేయాలి.
- వ్యక్తిగత, సామాజిక అటవీ హక్కులను పాటిస్తూ ఆదివాసీలకు పట్టాలు అందించాలి.
- వారి కోసం ఏర్పాటు చేసిన కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడడం ద్వారా జీవనానికి యోగ్యమైన వాతావరణం కల్పించాలి.
- ప్రాజెక్టు కారణంగా నివాసాలను కోల్పోయిన ఆదివాసీలకు ప్రాజక్టు ప్రాంతంలోని జల, అటవీ వనరులపై హక్కులు కల్పించాలి.
- ప్రాజక్టు పూర్తయ్యాక వచ్చే టూరిజం, విద్యుత్, ఇతర రంగాల్లో ఆదివాసీలకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.
- భూసేకరణ సందర్భంగా చోటుచేసుకున్న అవినీతిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి.