River Krishna: కృష్ణా నదిలో మునిగిన పుట్టి.. తల్లీకుమార్తెల సహా నలుగురి గల్లంతు

4 missing 9 rescued after raft carrying 13 people capsizes in Krishna river

  • ఒడ్డు నుంచి బయలుదేరిన అరగంటలోనే ప్రమాదం
  • ప్రవాహ తీవ్రతకు అలల తాకిడి పెరిగి బోల్తా
  • నేడు రంగంలోకి ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు

కృష్ణా నదిలో పెను ప్రమాదం సంభవించింది. 13 మందితో ప్రయాణిస్తున్న పుట్టి మునిగిన ఘటనలో చిన్నారి సహా నలుగురు గల్లంతు కాగా, 9 మంది ప్రాణాలతో బయటపడ్డారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పంచదేవ్‌పహాడ్ రేవు వద్ద నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. ఒడ్డు నుంచి పుట్టి బయలుదేరిన అరగంటలోపే ప్రమాదం జరగడం గమనార్హం.

సాయంత్రం 4:30 సమయంలో పుట్టి బయలుదేరింది. కర్ణాటకలోని రాయచూరు జిల్లా పెద్దకురుమ గ్రామానికి చెందిన 13 మంది అందులో బయలుదేరారు. బయలుదేరిన కాసేపటికే ప్రవాహ తీవ్రతకు అలల తాకిడి పెరిగి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో నర్సమ్మ (30), చెన్నమ్మ (50), సుమలత (25)తోపాటు ఆమె 9 ఏళ్ల కుమార్తె రోజా గల్లంతయ్యారు. పుట్టిని నడిపే అంజిలప్ప సహా, దళపతి, నాగప్ప, బుడ్డన్న, తిమ్మన్న, చిన్ననాగేశ్, మోహన్, విష్ణు అనే ప్రయాణికులు ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ చోట చెట్లు తగలడంతో వాటిని పట్టుకుని కేకలు వేశారు.

పస్పుల నది ఒడ్డున వారిని గమనించిన పుట్టి నడిపే యువకులు కాపాడారు. పంచదేవ్‌పహాడ్ గ్రామానికి చెందిన యువకులు నదిలోకి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి అంజిలప్పను రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది వెంటనే నది వద్దకు చేరుకుని సాయంత్రం ఆరున్నర గంటల వరకు గాలింపు కొనసాగించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చీకటి పడడంతో గాలింపును నిలిపివేసిన అధికారులు నేడు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలతో గాలించనున్నారు.

  • Loading...

More Telugu News