Corona Virus: కరోనాపై విజయం దిశగా భారతావని... నిదర్శనం 'ఆర్' ఫ్యాక్టర్!
- చాలా రాష్ట్రాల్లో ఒక పాయింట్ కు ఆర్ ఫ్యాక్టర్
- రీ ప్రొడక్షన్ రేటు తగ్గడం శుభ సూచకం
- 20 రాష్ట్రాల్లో తగ్గుతున్న ఆర్ ఫ్యాక్టర్
- గణాంకాలు విశ్లేషించిన ప్రొఫెసర్ సితాబ్రా సిన్హా
కరోనా మహమ్మారిపై విజయం దిశగా భారతావని సాగుతోందా? అవుననే అంటున్నారు అధ్యయనకారులు. దానికి నిదర్శనంగా 'ఆర్' ఫ్యాక్టర్ ను ప్రస్తావిస్తున్నారు. అంటే రీ ప్రొడక్షన్ రేట్... ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే... వైరస్ సోకిన ఓ వ్యక్తి, ఎంతమందికి వైరస్ అంటించాడన్న గణాంకమే ఆర్ ఫ్యాక్టర్. అది ఇప్పుడు ఇండియాలో గణనీయంగా తగ్గుతోంది. అదే వైద్యాధికారులకు, శాస్త్రవేత్తలకు ఇప్పుడు ఊరటను కలిగిస్తూ, వైరస్ పై గెలిచేందుకు ఇండియా పరుగులు పెడుతోందన్న అంచనా మనసులో కలిగేలా చేస్తోంది.
ఆర్ లేదా ప్రొడక్షన్ రేటు 2.0 గా ఉంటే, వైరస్ సోకిన ఓ వ్యక్తి, మరో ఇద్దరికి దాన్ని అంటించినట్టు. ఆపై వారిద్దరూ మరో నలుగురికి, ఆ నలుగురూ మరో ఎనిమిది మందికి, ఇలా వైరస్ వ్యాపిస్తూ, మహమ్మారిగా మారుతుంది. ఇదే ఆర్ ఫ్యాక్టర్ ఒకటికన్నా తక్కువకు పడిపోతే... వైరస్ నెమ్మదిగా మాయమవుతున్నట్టు లెక్క. ఇప్పుడు ఇండియాలో ఆ పరిస్థితే కనిపిస్తోంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ గణనీయంగా తగ్గుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
జూలై 21 నుంచి ఆగస్టు 14 మధ్య ఆర్ ఫ్యాక్టర్ గణాంకాలను పరిశీలిస్తే, గుజరాత్, ఝార్ఖండ్, జమ్మూ కశ్మీర్ లో 1.0 కన్నా తక్కువగానే ఉంది. తెలంగాణ విషయానికి వస్తే, జూలై మూడవ వారంలో 1.0 కన్నా తగ్గిన ఆర్ ఫ్యాక్టర్ తిరిగి పెరగడం మొదలైంది. అంటే, దీన్ని కిందకు తీసుకుని రావడానికి కఠిన చర్యల అవసరం ఎంతైనా ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తగ్గుతున్నట్టుగా అనిపించిన ఆర్, ఆపై తిరిగి పెరగడం ప్రారంభించింది. ఈ రాష్ట్రాల్లోనూ అత్యవసర చర్యలు తీసుకోవాల్సిందే.
ఇండియాలోని ఆరు పెద్ద రాష్ట్రాల్లో కరోనా తిరిగి విజృంభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అసోం, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పక్షం రోజుల క్రితం వరకూ 1.0గా ఉన్న ఆర్ ఫ్యాక్టర్, ఇప్పుడు 1.30కు పెరిగి ఆందోళన కలిగిస్తోంది. ఆర్ ఫ్యాక్టర్ కర్వ్ ను గణనీయంగా అదుపు చేయగలిగిన రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. కరోనా వైరస్ పై పోరాటంలో తమిళనాడును ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం కేవలం ఆర్టీ-పీసీఆర్ టెస్టులను మాత్రమే చేస్తోంది. అయితే, ఆర్ ఫ్యాక్టర్ గత వారం రోజులుగా తిరిగి పెరుగుతోంది.
పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్, తగ్గుతూ, పెరుగుతూ అనిశ్చితిలో కొనసాగుతోంది. ఇక దేశం మొత్తం మీద గణాంకాలను పరిశీలిస్తే, ఆర్ ఫ్యాక్టర్, సరాసరిన 1.20 నుంచి 1.06కు చేరుకుంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రం సమన్వయంతో కృషి చేసి, ఆర్ ఫ్యాక్టర్ ను 1 కన్నా కిందకు తీసుకుని వచ్చేందుకు అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
అయితే, ఆర్ ఫ్యాక్టర్ అర్థం చేసుకోవడానికి చాలా సులభంగానే ఉంటుందని, కానీ గణాంకాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెన్నై ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ సితాబ్రా సిన్హా వ్యాఖ్యానించారు. ఆర్ ఫ్యాక్టర్ పై ఆయన చేసిన రీసెర్చ్ పేపర్లు ఎన్నో అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. ఈ ఆర్ ఫ్యాక్టర్ ప్రకారం, ఏదైనా రాష్ట్రంలో గణాంకాలు తగ్గుతూ వస్తే, వైరస్ అదుపులోకి వస్తున్నట్టే. ఈ పద్ధతిని ఓ సంకేతంగా మాత్రమే పరిగణించాలన్నది సితాబ్రా సిన్హా సలహా.