Detel: ప్రపంచంలోనే అత్యంత చౌక టూ వీలర్... ఇండియాలో 'డీటెల్' ఆవిష్కరణ!
- ధర రూ. 19,999 మాత్రమే
- ఒకసారి చార్జింగ్ తో 60 కిలోమీటర్ల ప్రయాణం
- రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు
- వెల్లడించిన డీటెల్ సీఈఓ యోగేష్ భాటియా
ఇప్పటికే తక్కువ ధరలో ఫీచర్ ఫోన్, టీవీలను విడుదల చేసిన డీటెల్, ఇప్పుడు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ టూ వీలర్ ను ఆవిష్కరించి చరిత్ర సృష్టించింది. 'డీటెల్ ఈజీ' పేరిట విడుదలైన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ధర కేవలం రూ.19,999 మాత్రమే. ఈ ధరకు జీఎస్టీ అదనమని సంస్థ వెల్లడించింది.
కాగా, ఈ బైక్ లో 48 వాట్ల 12 ఏహెచ్ ఎల్ఐఎఫ్ఈపీవో 4 బ్యాటరీ ఉంటుంది. ఒకసారి చార్జింగ్ చేయడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుందని, ఆపై గంటకు 25 కిలోమీటర్ల వేగంతో 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని, దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ లు అవసరం లేదని సంస్థ సీఈఓ యోగేష్ భాటియా తెలిపారు.
కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహాన్ని ఇస్తోందని గుర్తు చేసిన ఆయన, ప్రజల్లో సైతం పర్యావరణం పట్ల అవగాహన పెరుగుతోందని, పెట్రోలు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి వాహనాలకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందని అన్నారు. సమీప భవిష్యత్తులో ఈవీ పరిశ్రమ ఇండియాలో ఎంతగానో అభివృద్ధి చెందనుందని, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగనుందని అన్నారు.
రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకు ఈ చిన్న బైక్ ఎంతో ఉపకరిస్తుందని, తక్కువ దూరాలను, పట్టణ, పల్లె ప్రాంతాల్లో ఆఫీసులకు వెళ్లి వచ్చే వారికి సులువుగా ఉంటుందని తెలిపారు. కాగా, గతంలో డీటెల్ సంస్థ రూ. 299కి ఫీచర్ ఫోన్ ను, ఆపై రూ. 3,999కి టీవీని అందించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.