PM Cares: కరోనా నిధిని విపత్తు నిధికి బదలాయించవలసిన అవసరం లేదు... తుది నిర్ణయం కేంద్రానిదే: సుప్రీంకోర్టు

Cannot Transfer PM Cares Fund to NDRF says Supreem
  • పీఎం కేర్స్ నిధిని ఎన్డీఆర్ఎఫ్ కు జమ చేయాలని పిటిషన్
  • అవకతవకలు జరుగుతున్నాయని వాదన
  • విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం
  • బదలాయించరాదంటూనే కేంద్రం ఇష్టమని తీర్పు
  • పీఎం ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉన్న పీఎం కేర్స్
  • ఇప్పటికే కోట్లాది రూపాయల విరాళాలు
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధిలో ఉన్న డబ్బును ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్)కు బదలాయించమని ఆదేశించజాలమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పీఎం కేర్స్ నిధి, డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేశారని, ఇందులోని డబ్బును తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ కు బదలాయించాలని కోరుతూ ఓ స్వచ్చంద సంస్థ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపింది.

పీఎం కేర్స్ నిధి, ఓ విభిన్నమైనదని అభివర్ణించిన సుప్రీంకోర్టు, ఈ నిధికి ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ లు విరాళాలను అందించాయని, అయితే, ప్రభుత్వం ఈ నిధిని విపత్తు నిధికి బదలాయించాలని భావిస్తే మాత్రం తాము అడ్డుకోబోమని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం మాత్రమేనని తేల్చి చెప్పింది. అయితే, ఓ అత్యవసర నిధి కింద పోగుచేసిన డబ్బును, మరో అవసరానికి వాడాలని భావించడం సహేతుకం కాదన్నది తమ అభిప్రాయమని వ్యాఖ్యానించింది.

వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పిస్తూ, ఎన్జీవో సంస్థ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

ఇదే సమయంలో కరోనా వంటి మహమ్మారులు సోకిన వేళ కూడా విపత్తు నిధిని వాడుకునేందుకు వీలును కల్పిస్తూ, కొత్త ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా, ఈ సంవత్సరం మార్చి 28న పీఎం కేర్స్ నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించగా, ఎన్నో కోట్ల రూపాయలను పలువురు వ్యక్తులు, సంస్థలు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిధిని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నిర్వహిస్తూ, ఎక్స్ అపీషియో చైర్మన్ గానూ వ్యవహరిస్తుండగా, హోమ్, ఆర్థిక శాఖల మంత్రులు ట్రస్టీలుగా ఉన్నారు.
PM Cares
NDRF
Funds
Supreme Court

More Telugu News