Private Hospital: ఒంగోలులో ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యం... మృతదేహాల తారుమారు!
- కరోనాతో మృతి చెందిన ఖలీల్
- ఖలీల్ కుటుంబ సభ్యులకు వేరే మృతదేహాన్ని ఇచ్చిన ఆసుపత్రి
- ఖలీల్ మృతదేహం మరొకరికి అప్పగింత
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యం ఓ కుటుంబానికి వేదన మిగిల్చింది. ఒక కుటుంబానికి అప్పగించాల్సిన మృతదేహాన్ని మరో కుటుంబానికి అప్పగించారు. ఒంగోలు శివారు ప్రాంతంలో ఉన్న రమేశ్ సంఘమిత్ర ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. కంభం ప్రాంతానికి చెందిన ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి కరోనాతో సంఘమిత్ర ఆసుపత్రిలో మరణించాడు. ఆసుపత్రి వర్గాలు ఖలీల్ మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆసుపత్రి వద్దకు వచ్చారు.
అయితే ఖలీల్ మృతదేహానికి బదులు వీరయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని ఇవ్వడంతో ఖలీల్ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గట్టిగా ప్రశ్నించగా, ఖలీల్ మృతదేహాన్ని అంతకుముందే వీరయ్య కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు వెల్లడైంది. మరింత ఆరా తీస్తే వీరయ్య కుటుంబ సభ్యులు ఖలీల్ మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించేశారని తేలింది. దాంతో ఖలీల్ కుటుంబం ఎంతో వేదనకు గురైంది. తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించిన ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం అధికారులకు విజ్ఞప్తి చేసింది.