Tamilisai Soundararajan: కేసీఆర్ సర్కార్ పై జాతీయ మీడియాలో గవర్నర్ సంచలన వ్యాఖ్యలు!
- కరోనా కట్టడిలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది
- ఐదారు లేఖలు రాసినా ఫలితం కనపడలేదు
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవు
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ, కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని అన్నారు. కరోనా ఉద్ధృతిని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కరోనాను కట్టడి చేయడంలో ఎక్కువ టెస్టులు చేయడమే ముఖ్యమని అన్నారు. మొబైల్ టెస్టింగులు చేయాలని ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. కరోనా కట్టడిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఐదారు లేఖలు రాశామని... అయినా ఫలితం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కరోనాను కట్టడి చేయాల్సిన ప్రాంతాల్లో సైతం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని తమిళిసై అన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు టెస్టులు చేస్తున్నామంటూ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం సరైన సదుపాయాలు లేవని... అందుకే కరోనా బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయని ప్రభుత్వం చెపుతున్నా... ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను కలసినప్పుడు ఈ విషయాలను ఆయనకు గట్టిగానే చెప్పానని అన్నారు.