Sirivennela Sitharama Shastri: బాలు అన్నయ్యా... ఇక చాలు, నీ గళానికి ఆ హక్కులేదు: సిరివెన్నెల సీతారామశాస్త్రి

Sirivennela Sitharama Shastri emotional note on SP Balaubrahmanyam
  • కరోనాతో పోరాడుతున్న ఎస్పీ బాలు
  • ఇన్నాళ్లు ఆ గళం నిశ్శబ్దంగా ఉంటే ఎలా? అంటూ సిరివెన్నెల వేదన
  • కొత్త పల్లవితో వచ్చేసేయ్ అంటూ ఆహ్వానం
సినీ పాటకు కొత్త ఒరవడి దిద్దిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఇవాళ ఆయన కరోనా బారినపడి తీవ్రపోరాటం సాగిస్తుంటే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులే కాదు, యావత్ అభిమాన లోకం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. బాలు త్వరగా కోలుకోవాలని నిత్యం ప్రార్ధనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వేదనాభరితమైన వీడియో సందేశం వెలువరించారు.

"ఒక్క ప్రాణం అక్కడ నలతగా ఉండి ఆయాస పడుతుంటే ఇక్కడ ఒక్కటి కాదు, వేలు, లక్షలుకాదు, కోట్లాది ప్రాణాలు కొట్టుకుంటున్నాయి. ఒక్క శ్వాసలో సరిగమలు అపశ్రుతిని సరిచేసుకుంటుంటే నా దేశపు ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొన్ని తరాలుగా గాలి బాలు పాటగా, మాటగా వీస్తూనే ఉంది, విహరిస్తూనే ఉంది. ఇప్పుడెందుకో చిన్న వెంటిలేటర్ ఇరుకులో చిక్కుకుని విలవిల్లాడుతోంది.

కొన్నాళ్లుగా ఆకాశం కంటికి మింటికి ఏకధారగా రోదించి, నిన్నటి నుంచే వెచ్చని సూర్యకిరణాలతో చెక్కిళ్లు తుడుచుకుని కాస్త తెరిపిటపడుతోంది. అన్నయ్యా ఇకచాలు!.. ఇన్ని రోజులు నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకునే హక్కు ఆ గళానికి లేదు. త్వరగా కోలుకో. కొత్త పల్లవితో ప్రకృతికి ప్రాణగీతికలా చిగురించనీ" అంటూ వీడియోలో భావోద్వేగభరితంగా వ్యాఖ్యానించారు.

Sirivennela Sitharama Shastri
SP Balasubrahmanyam
Video
Corona Virus
Tollywood

More Telugu News