Sachin Tendulkar: ధోనీ సూక్ష్మబుద్ధిని గమనించి అతడే నెక్ట్స్ కెప్టెన్ అని బీసీసీఐకి చెప్పాను: సచిన్
- ఇటీవలే రిటైర్మెంటు ప్రకటించిన ధోనీ
- మ్యాచ్ ను చదవడంలో ధోనీ దిట్ట అని సచిన్ కితాబు
- సచిన్ సూచనలతో ధోనీకి బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ!
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసింది. టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ధోనీ సామర్థ్యాన్ని మొదట్లోనే గుర్తించానని తెలిపాడు. మ్యాచ్ ల్లో ఫస్ట్ స్లిప్ లో ఫీల్డింగ్ చేసే సమయంలో ధోనీనే గమనిస్తుండేవాడ్నని, అతడు ఎంత సూక్ష్మబుద్ధి గలవాడో పసిగట్టి, తదుపరి భారత కెప్టెన్ అతడేనని బీసీసీఐకి చెప్పానని వెల్లడించాడు.
2007లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు ముందు సచిన్, గంగూలీ, ద్రావిడ్ ఆ టోర్నీలో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకోగా, భవిష్యత్ కెప్టెన్ ఎవరైతే బాగుంటుందని బీసీసీఐ పెద్దలు సచిన్ ను అడగ్గా, తానేం చెప్పాడో సచిన్ వివరించాడు.
"వివరాల్లోకి వెళ్లలేను కానీ, కొన్ని అంశాలు చెబుతాను. బీసీసీఐ సీనియర్లు నా అభిప్రాయం అడిగారు. ధోనీ మ్యాచ్ ను చదివేసే విధానం ఎలా ఉంటుందో వారికి వెల్లడించాను. స్లిప్స్ లో ఫీల్డింగ్ చేసే సమయంలో ధోనీతో మాట్లాడుతుండేవాడిని. మ్యాచ్ పరిస్థితులపై ఏం ఆలోచిస్తుండేవాడో తెలుసుకునేవాడిని. అతడికి మంచి క్రికెట్ బుర్ర ఉందని అర్థమైంది. బోర్డుకు కూడా అదే చెప్పాను. ధోనీలో మరో గొప్ప సామర్థ్యం ఏంటంటే... తన నిర్ణయాల పట్ల ఎవరినైనా ఒప్పించగలడు" అంటూ సచిన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా, నాడు సచిన్ సూచనలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ ధోనీని దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాకు సారథిగా నియమించింది. 2007లో జరిగిన ఈ మెగా టోర్నీలో కప్ సాధించడం ఓ చరిత్ర అయితే, ఆ తర్వాత ధోనీ సారథ్యంలోనే టీమిండియా మిగతా ఫార్మాట్లలోనూ చాంపియన్ గా నిలవడం మరో చరిత్ర.