Vijay Setupati: విజయ్ సేతుపతి హీరోగా.. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800'

Vijay Setupati to play as Muralidharan

  • బౌలర్ గా రికార్డు సృష్టించిన మురళీధరన్ 
  • మురళీధరన్ గురించి తెలియని విశేషాలతో కథ
  • బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న విజయ్ సేతుపతి 
  • 800 వికెట్లు తీసిన దానికి గుర్తుగా టైటిల్  

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ముత్తయ్య మురళీధరన్ ది ఓ ప్రత్యేక అధ్యాయం. మైదానంలో చెరగని చిర్నవ్వు చిందిస్తూ.. తన స్పిన్ మాయాజాలంతో మహా మహా బ్యాట్స్ మెన్ ను సైతం బోల్తా కొట్టించి .. పెవిలియన్ కి పంపిన ఘనత అతనిది. బౌలర్ గా తన పేర ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. అలాంటి మురళీధరన్ జీవిత కథ ఇప్పుడు వెండితెరకు ఎక్కుతోంది.

ప్రముఖ తమిళ నటుడు, కథానాయకుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రను పోషించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందు మురళీధరన్ జీవితానికి సంబంధించిన సంఘటనలు ఇందులో ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. క్రికెట్ ప్రియులకు, అతని అభిమానులకు ఎవరికీ తెలియని మురళీధరన్ జీవితాన్ని ఇందులో ఆవిష్కరిస్తారట.

ఈ పాత్రలో నటించడం కోసం విజయ్ సేతుపతి ఇప్పటి నుంచే బౌలింగ్ ప్రాక్టీసు చేస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే బరువు కూడా బాగా తగ్గడానికి వర్కౌట్స్ చేస్తున్నాడట. ఇక ఈ చిత్రానికి '800' అనే టైటిల్ని నిర్ణయించినట్టు సమాచారం. మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్లో 800 వికెట్లు తీసిన వైనానికి సంకేతంగా దీనికి ఆ టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దార్ మోషన్ పిక్చర్స్ తో కలసి సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రానికి ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తాడు. తమిళంతో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News