Rohit Sharma: ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మ, వినేశ్ ఫోగాట్ ల పేర్లు సిఫారసు చేసిన కమిటీ
- ఈ ఏడాది ఖేల్ రత్నకు ఐదుగురి పేర్లు ఖరారు
- చివరి నిమిషంలో మహిళల హాకీ కెప్టెన్ పేరు చేర్చిన వైనం
- అర్జున అవార్డుకు 29 మందితో జాబితా
దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా గుర్తింపు ఉన్న రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కోసం క్రికెటర్ రోహిత్ శర్మ సహా ఐదుగురి పేర్లను క్రీడల మంత్రిత్వ శాఖ ఎంపిక కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది.
రోహిత్ శర్మ, మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్, భారత హాకీ మహిళల జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా, పారా ఒలింపిక్స్ హైజంప్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు పేర్లను కమిటీ కేంద్రానికి నివేదించింది. తొలుత ఖేల్ రత్న కోసం నలుగురి పేర్లనే ఖరారు చేసినా, మహిళల హాకీ సారథి రాణి రాంపాల్ పేరును చివరి నిమిషంలో చేర్చారు.
ఇక, మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం అర్జున అవార్డు కోసం 29 మందితో తుది జాబితా ఖరారు చేశారు. వీరిలో టీమిండియా పొడగరి ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, విలువిద్య క్రీడాకారుడు అతాను దాస్, హాకీ క్రీడాకారిణి దీపికా ఠాకూర్, కబడ్డీ ఆటగాడు దీపకు హుడా, టెన్నిస్ ఆటగాడు దివిజ్ శరణ్ తదితరులు ఉన్నారు.