Russia: కరోనాను మా వ్యాక్సిన్ ఎలా నాశనం చేస్తోందో చూడండి... వీడియో విడుదల చేసిన రష్యా!
- గత వారంలో వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన రష్యా
- వైరస్ అంతమవుతుందంటూ రష్యన్ సంస్థ వీడియో
- గ్రాఫిక్స్ తో సృష్టించినదే అయినా వైరల్
గత వారంలో రష్యా, స్పుత్నిక్ వీ పేరిట కరోనా వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా పరిశోధకుల నుంచి పలు అనుమానాలు, పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నా, రష్యా ఏ మాత్రమూ వెనుకడుగు వేయకుండా, ముందుకు సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పై తమ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో చూడాలంటూ ఓ వీడియోను విడుదల చేసింది.
కరోనా వ్యాక్సిన్ తయారీకి నిధులను అందించిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ఈ వీడియోను విడుదల చేసింది. 38 సెకన్ల నిడివి వున్న ఈ వీడియోలో ఓ వైరస్ కణం చుట్టూ స్పుత్నిక్ ఉపగ్రహం తిరుగుతూ ఉండగా, ఆ కణం మాడిపోతున్నట్టుగా గ్రాఫిక్స్ తో చిత్రీకరించారు. ఆపై వైరస్ కణంలోపల భూమి ఉన్నట్టుగా చూపారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కాగా, తొలి కృత్రిమ శాటిలైట్ గా స్పుత్నిక్ ను ప్రయోగించిన రష్యా, అదే పేరుపై వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రష్యాలోని ఓ ల్యాబ్ లో పెద్దఎత్తున వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న వీడియోను కూడా రష్యా వార్తా సంస్థ 'స్పుత్నిక్ న్యూస్' విడుదల చేసింది. 'టాస్' న్యూస్ ఏజన్సీ కథనం ప్రకారం, స్పుత్నిక్ వీ విషయంలో తప్పనిసరిగా జరగాల్సిన మూడవ దశ ట్రయల్స్ మరో వారం, పది రోజుల్లో జరుగనున్నాయి. ఈ దఫా వేల మందిపై మాస్కో రీజియన్ లో వ్యాక్సిన్ టెస్ట్ జరుగనుందని వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన ప్రొటోకాల్ ను రష్యా ఆరోగ్య శాఖ మరో వారంలో అనుమతించనుందని సమాచారం. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 2.16 కోట్లను దాటిపోగా, ఇప్పటివరకూ 7.74 లక్షలకు పైగా మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే.