Jagan: జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
- నూతన పారిశ్రామిక విధానానికి ఆమోద ముద్ర వేసే ఛాన్స్
- వైఎస్సార్ విద్యాకానుకకు ఆమోదం తెలపనున్న కేబినెట్
- ఆసరా పథకం అమలు గురించి చర్చ
ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తోన్న పలు పథకాలపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఈ రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. మంత్రులతో జగన్ చర్చించిన అనంతరం నూతన పారిశ్రామిక విధానానికి ఆమోద ముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
వచ్చేనెల 5న ఇచ్చే వైఎస్సార్ విద్యాకానుకకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీలో వైఎస్సార్ ఆసరా పథకం అమలు గురించి కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే, కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులు, గోదావరి వరద సహాయక కార్యక్రమాల అమలుపై మంత్రులు చర్చిస్తున్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల పరిస్థితితో పాటు వైఎస్సార్ బీమా, కొత్తగా బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, డిసెంబర్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభంపై కూడా చర్చిస్తున్నారు. వీటితో పాటు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కాసేపట్లో ఆయా అంశాలపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేయనుంది.