Bus: లేదు.. ఆ బస్సు హైజాక్ కాలేదు: స్పష్టం చేసిన పోలీసులు
- 34 మంది ప్రయాణికులతో గురుగ్రామ్ నుంచి గ్వాలియర్‌కు
- మార్గమధ్యంలో బస్సును ఆపి స్వాధీనం చేసుకున్న ఫైనాన్స్ కంపెనీ
- ప్రయాణికులు క్షేమం.. ఫైనాన్స్ కంపెనీపై కేసు నమోదు
34 మంది ప్రయాణికులతో గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు వెళ్తున్న బస్సు హైజాక్‌కు గురైనట్టు వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. ఆ బస్సు హైజాక్ కాలేదని, బస్సుపై తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ దానిని స్వాధీనం చేసుకుందని తెలిపారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గురుగ్రామ్ నుంచి బయలుదేరిన బస్సును ఈ తెల్లవారుజామున మార్గమధ్యంలో ఆపిన దుండగులు డ్రైవర్, కండక్టర్‌ను కిందికి దించి బస్సును హైజాక్ చేసినట్టు వార్తలు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా అసలు విషయం తెలియడంతో అందరిలోనూ టెన్షన్ మాయమైంది.
బస్సుపై రుణం తీసుకున్న యజమాని ఈఎంఐలు చెల్లించకపోవడంతో బస్సును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఫైనాన్స్ కంపెనీపై కేసులు నమోదు చేసినట్టు చెప్పిన పోలీసులు బస్సును ఝాన్సీకి తరలించారు.