Supreme Court: ఏపీలో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
- హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోను ఎత్తివేయాలన్న ఏపీ సర్కారు
- పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్
- మరో బెంచ్‌కు పంపాలని చెప్పిన జస్టిస్ నారీమన్ ధర్మాసనం
ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. పాలన వికేంద్రీకరణతో పాటు సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాము ఇచ్చిన జీవోలు రాజ్యాంగపరమైనవా? కాదా? అనే అంశాలను పరిశీలించకుండా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. ఈ రోజు ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌తో కూడిన ధర్మాసనం విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.
అందుకే మరో బెంచ్ కు బదిలీ..
అమరావతి రైతుల తరఫున సుప్రీంకోర్టులో రాజధాని పరిరక్షణ సమితి ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. అయితే, వారి తరఫున న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్ తండ్రి ఎఫ్.ఎస్.నారీమన్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును మరో బెంచ్‌కు పంపాలని జస్టిస్ నారిమన్ ధర్మాసనం తెలిపింది.