Revanth Reddy: సోషల్ మీడియాలో వచ్చిన ఆ కథనాలు శుద్ధ అబద్ధం: రేవంత్ రెడ్డి
- ప్రియాంక వర్గంలో చేరానని ప్రచారం చేస్తున్నారు
- కాంగ్రెస్ పార్టీలో వర్గాలకు తావు లేదు
- ఇలాంటి కథనాలు చూసి అపోహలకు లోను కావొద్దు
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు తనను విస్మయానికి గురి చేశాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. వివరణలు లేకుండా ప్రచారంలోకి వచ్చే అలాంటి కథనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అలాంటి కథనాలు శ్రుతి మించుతున్నప్పుడు వాటిపై స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాజీవితంలో చురుకైన పాత్రను పోషిస్తున్నప్పుడు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికో, ఎదుగుదలను అడ్డుకోవడానికో ప్రత్యర్థులు కుయుక్తులకు పాల్పడుతుంటారని చెప్పారు. సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఉన్నవి, లేనివి పోగేసి ప్రచారం చేయడం చాలా తేలికైపోయిందని అన్నారు.
తాను ప్రియాంకాగాంధీ వర్గంలో చేరానని, ఆమె నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతున్నట్టు తనకు తెలిసిందని... ఆ కథనం పూర్తిగా నిరాధారమని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలకు తావులేదని అన్నారు. బూత్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు ప్రతి ఒక్కరు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో సమర్థవంతంగా ప్రజల పక్షాన పోరాడుతున్నారని చెప్పారు. పార్టీ నాయకత్వంపై అందరికీ నమ్మకం ఉందని అన్నారు. ఇలాంటి కథనాలను చూసి అపోహలకు లోనుకావద్దని చెప్పారు.
ఈ సందర్భంగా తనను అభిమానించే వారికి కూడా ఒక విన్నపం చేయాలనుకుంటున్నానని... మీరు కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారని.. అలాంటి పోస్టుల వల్ల వ్యక్తిగతంగా తనకు, పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని రేవంత్ అన్నారు. తన ప్రత్యర్థులకు కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానని... నేరుగా మీరు ఎలాంటి దాడి, విమర్శలు చేసినా సమాధానం చెపుతానని... దొడ్డి దారిలో ప్రచారాలకు పూనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దుష్ప్రచారాలకు ఒడిగడితే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.