Corona Virus: హైదరాబాద్‌లో 6.6 లక్షల మందికి కరోనా?.. ఇళ్ల నుండి వచ్చే మురుగు ఆధారంగా అంచనా!
- ఐఐసీటీ, సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి
- మురుగునీటి పరీక్ష ఆధారంగా అంచనా వేసిన శాస్త్రవేత్తలు
- వైరస్ సోకి తగ్గిపోయినా 35 రోజుల వరకు బాధితుల నుంచి వైరస్ పదార్థాల విడుదల
గతంతో పోలిస్తే హైదరాబాద్‌లో కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తాజా పరిశోధనలో వెల్లడైంది. గత 35 రోజుల్లో ఏకంగా 6.6 లక్షల మంది నగరవాసులు ఈ మహమ్మారి బారినపడ్డారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థలు జరిపిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. మురుగునీటి నమూనాలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. లక్షణాలు లేకపోవడంతో చాలామందికి తమకు వైరస్ వచ్చి వెళ్లిన విషయం కూడా తెలియకుండా పోయిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కరోనా బారినపడి వారి ముక్కునుంచి కారే స్రావాలు, నోటి తుంపర్ల నుంచే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బహిర్గతమవుతుంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి తీరును తెలుసుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐఐసీటీ, సీసీఎంబీలు మురుగునీటిపై పరీక్షలు చేపట్టాయి. హైదరాబాద్ వ్యాప్తంగా రోజూ 1800 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుండగా, 760 మిలియన్ లీటర్లు అంటే 40 శాతం నీటిని మాత్రమే మురుగునీటి శుద్ధి కేంద్రాలలో శుద్ధి చేస్తున్నారు. వీటిలో 80 శాతం కేంద్రాల వద్ద 35 నమూనాలను సేకరించి సీసీఎంబీలో పరీక్షించారు.
నిజానికి కరోనా వైరస్ సోకి తగ్గిపోయినా 35 రోజుల వరకు వైరస్ పదార్థాలు బాధితుల మలమూత్రాల నుంచి విడుదలవుతుంటాయి. ప్రతి ఇంట్లోంచి ఎంత మురుగునీరు విడుదలవుతోందన్న గణాంకాల ఆధారంగా ఎంతమందికి కరోనా వచ్చి తగ్గి ఉంటుందనే అంచనాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని ప్రకారం నగరంలో 2 లక్షల మంది విసర్జితాల్లో వైరస్ విడుదలైనట్టు గుర్తించిన పరిశోధకులు, శుద్ధి చేయని 60 శాతం మురుగును కూడా కలిపితే మొత్తం 6.6 లక్షల మందికి గత 35 రోజుల్లో కరోనా సోకి తగ్గినట్టు ఓ అంచనాకొచ్చారు.
తాజా అధ్యయనం ప్రకారం.. కరోనా రోగ లక్షణాలు లేని వారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో దాని నియంత్రణలో మన ఆరోగ్య వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు. కాగా, శుద్ధి చేయని నీటిలో వైరస్ ఆనవాళ్లు కనిపించినా శుద్ధి తర్వాత వైరస్ కనిపించలేదని ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వెంకటమోహన్ తెలిపారు. మురుగునీటిలో ఉన్న వైరస్ ఆనవాళ్లలో ఆర్ఎన్ఏ మాత్రమే ఉందని, దీని ద్వారా వైరస్ ఇతరులకు సంక్రమించదని ఆయన తెలిపారు.