West Bengal: చనిపోయిన యజమాని ఏటీఎం కార్డుతో రూ. 35 లక్షలు డ్రా చేసిన పనిమనిషి
- పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘటన
- రెండు నెలలుగా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా
- రూ. 27 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చనిపోయిన యజమాని ఏటీఎం కార్డును దొంగిలించి రూ. 35 లక్షలు డ్రా చేసిన పనిమనిషి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. కోల్కతాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నదియ, నాసికాపురకు చెందని రీటారాయ్ అన్వర్షా రోడ్డులోని ఓ ఇంటిలో ఏడేళ్లుగా పనిచేస్తోంది.
లాక్డౌన్ మొదలైన తర్వాత కొన్ని రోజులకే ఇంటి యజమాని మృతి చెందాడు. అతడి ఏటీఎం కార్డును దొంగిలించిన రీటా గత రెండు నెలలుగా పలు దఫాలుగా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడం మొదలుపెట్టింది. అలా ఇప్పటి వరకు మొత్తం రూ. 35 లక్షలు డ్రా చేసింది.
తన తండ్రి ఖాతాలోంచి డబ్బులు డ్రా అవుతున్న విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పనిమనిషి బాగోతం బయటపడింది. రీటాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా డబ్బులు తానే డ్రా చేసినట్టు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. డబ్బులు డ్రా చేసే విషయంలో ఆమెకు సహకరించిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 27 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.