Sharad Pawar: పొలిటికల్ టర్న్ తీసుకున్న సుశాంత్ కేసు... శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు
- దబోల్కర్ కేసులో సీబీఐ విచారణ ఇంకా ముగియలేదన్న పవార్
- సుశాంత్ కేసు కూడా అలా అవుతుందని తాను భావించడం లేదని వ్యాఖ్య
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సీబీఐకి సుప్రీంకోర్టు అప్పగించిన తర్వాత... ఈ అంశం పూర్తిగా రాజకీయపరమైన మలుపు తీసుకుంది. మొన్నటి వరకు బాలీవుడ్ లోని బంధుప్రీతి, హీరోయిన్ రియా చక్రవర్తి చుట్టూ తిరిగిన కేసు... ఇప్పుడు రాజకీయపరమైన వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారింది.
సుప్రీం తీర్పుతో సుశాంత్ కుటుంబానికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏర్పడిందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ముంబై పోలీసుల తీరును విమర్శిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడానికి సమయం ఆసన్నమైందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మహా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి, ఎన్సీపీ అధినేత అయిన శరద్ పవార్ స్పందించారు.
సుశాంత్ కేసులో సీబీఐ విచారణను స్వాగతిస్తూనే శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ కేసు విచారణను 2014లో సీబీఐ ప్రారంభించిందని... ఇప్పటి వరకు ఆ కేసు ముగియలేదని చెప్పారు. సుశాంత్ కేసు కూడా అపరిష్కృతంగానే మిగిలి పోతుందని తాను భావించడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని... కేసు విచారణలో సీబీఐకి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.