Chandrababu: 62 ఏళ్ల మాన్సాస్ ట్రస్టు చరిత్రలో ఇంత దయనీయమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా?: చంద్రబాబు
- ట్రస్టును అప్రదిష్ఠపాల్జేస్తున్నారంటూ అసంతృప్తి
- ఈ దుస్థితికి కారణం ఎవరన్న చంద్రబాబు
- ట్రస్టు పరిస్థితి దిగజారడం బాధాకరమని వెల్లడి
విజయనగరం మాన్సాస్ ట్రస్టును అప్రదిష్ఠ పాల్జేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయనగరం మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులు ఐదు నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలచివేసిందని పేర్కొన్నారు. 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో చూశామా? 62 ఏళ్ల మాన్సాస్ ట్రస్టు చరిత్రలో ఈ దయనీయ పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్టు పరిస్థితి ఇప్పుడెందుకిలా తయారైంది? అంటూ వ్యాఖ్యానించారు.
"ఎంతో ఆర్థిక పరిపుష్టి ఉన్న మాన్సాస్ వంటి సేవా సంస్థ ఇప్పుడిలా తయారవ్వడానికి కారణం ఎవరు? సజావుగా అందుతోన్న మాన్సాస్ సంస్థ సేవలను గాడి తప్పించింది ఇందుకేనా? ఈ విధమైన దుస్థితి రాకూడదనే విజయనగరం రాజా పీవీజీ రాజు వేలాది ఎకరాల భూములతో, వందల కోట్ల నగదు ఫిక్స్ డ్ డిపాజిట్లతో మాన్సాస్ ట్రస్టును ఆర్థికంగా పరిపుష్టం చేశారు. అంతటి గొప్ప సంస్థ ఇప్పుడిలా దిగజారడం చూస్తే ఎవరికైనా ఆత్మ క్షోభించకమానదు" అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.