Harley Davidson: భారత్ లో దుకాణం మూసేస్తున్న హార్లే డేవిడ్సన్!
- పదేళ్ల కిందట భారత్ వచ్చిన అమెరికా దిగ్గజ సంస్థ
- ఆశించిన రీతిలో సాగని విక్రయాలు
- అంతర్జాతీయంగానూ వ్యతిరేక పవనాలు
మోటార్ బైక్ అంటే బాగా మోజున్న ప్రతి ఒక్కరి కల హార్లే డేవిడ్సన్ బైక్ అంటే అతిశయోక్తి కాదు. హైఎండ్ బైక్ గా పేరుగాంచిన ఈ మోటార్ సైకిల్ కు చాలా దేశాల్లో ఫ్యాన్ క్లబ్ లు కూడా ఉన్నాయి. భారత్ లోనూ దీనికంటూ ప్రత్యేకంగా అభిమానులున్నారు. కానీ మార్కెట్ పరంగా హార్లే డేవిడ్సన్ కు భారత్ ఏమాత్రం కలిసిరాలేదు. దాంతో చేసేదిలేక భారత మార్కెట్ నుంచి తప్పుకోవాలనుకుంటోంది. దేశంలో తన కార్యకలాపాలను నిలిపివేయాలని భావిస్తోంది.
పదేళ్ల కిందట భారత్ లో అడుగుపెట్టిన హార్లే డేవిడ్సన్ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరపలేకపోయింది. 2020 ఆర్థిక సంవత్సరాంతానికి ఈ అమెరికా దిగ్గజ సంస్థ 2,500 బైక్ లను మాత్రమే విక్రయించగలిగింది. అంతేకాదు భారత్ లోని తన యూనిట్ నుంచి 2,100 బైక్ లను మాత్రమే ఎగుమతి చేయగలిగింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా2.10 లక్షల హార్లే డేవిడ్సన్ బైకులు అమ్ముడయ్యాయి.
భారత్ పరిస్థితులకు అనుగుణమైన బైక్ ల రూపకల్పన చేయలేకపోవడం, ఇతర కంపెనీల నుంచి ఎదురైన పోటీకి తగిన చర్యలు తీసుకోకపోవడం హార్లే డేవిడ్సన్ కు ప్రతికూలంగా మారింది. కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాక అనేక సంస్థల మాదిరే హార్లే డేవిడ్సన్ పరిస్థితి కూడా దిగజారింది. ఆ సంస్థ ప్రతినిధుల వ్యాఖ్యలు చూస్తుంటే, అంతర్జాతీయంగానూ ఈ దిగ్గజ సంస్థ తన కార్యకలాపాలపై ఏదో ఒక తీవ్ర నిర్ణయం తీసుకోనుందని అర్థమవుతోంది.