Somireddy Chandra Mohan Reddy: రాయలసీమలో మొదటి పంటకు కృష్ణా జలాల్లో హక్కు కల్పించండి: సోమిరెడ్డి డిమాండ్
- రాయలసీమ దుర్భిక్ష ప్రాంతమన్న సోమిరెడ్డి
- తక్కువ వర్షపాత ప్రాంతమని వెల్లడి
- నీళ్లు సముద్రం పాలయ్యేవరకు విడుదల చేయరేంటని అసంతృప్తి
రాయలసీమ దుర్భిక్ష ప్రాంతమని, సాగునీరు, తాగునీరు పరంగా ఎంతో వెనుకబడిన ప్రాంతం అని టీడీపీ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమలో మొదటి పంటకు కృష్ణా జలాల్లో హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద నీరు సముద్రానికి వెళ్లేంతవరకు కూడా నీళ్లు వదిలిపెట్టబోమంటే ఎట్లా అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవాళ కృష్ణా డెల్టాకు కృష్ణా జలాలతో పాటు గోదావరి నీళ్లు కూడా వస్తున్నాయని, తుంగభద్ర అదనపు జలాలు కూడా వస్తున్నాయని తెలిపారు. అందుకే రాయలసీమలో మొదటి పంటకు కూడా కృష్ణా జలాలు ఇవ్వాలని రైతుల తరఫున కోరుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పంటలు సమృద్ధిగా పండడంలేదని, నీటి సమస్య తీవ్రంగా ఉందని వెల్లడించారు.
గతేడాది పోతిరెడ్డిపాడుకు నీళ్లు వదిలేందుకు పది రోజుల పాటు ఆలస్యం చేశారని, అప్పుడు కూడా నీళ్లు సముద్రానికి వెళ్లేంతవరకు విడుదల చేయలేదని ఆరోపించారు. ఇవాళ శ్రీశైలం డ్యామ్ నిండిపోయిందని, ప్రకాశం బ్యారేజికి అదనపు జలాలు వస్తున్నాయని వివరించారు. ఒకట్రెండు రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండిపోతుందని తెలిపారు. అయినాగానీ, నీళ్లు సముద్రానికి పోతే తప్ప నీళ్లు వదలబోమని అనడం ఏం న్యాయం అని ప్రశ్నించారు.