Fire Accident: అతిపెద్ద ప్రమాదాన్ని తప్పించాం... గల్లంతైన ఉద్యోగుల ఆచూకీపై ఆందోళన: గువ్వల బాలరాజు
- గత రాత్రి 10.30 గంటల తరువాత ప్రమాదం
- గతంలో ఈ తరహా ప్రమాదాలను ఎదుర్కోని ఎన్డీఆర్ఎఫ్
- సింగరేణి నుంచి ప్రత్యేక బృందాల రాక
- ఈ ఉదయం మొదలైన సహాయక చర్యలు
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో గత రాత్రి సంభవించిన ప్రమాదం తరువాత గల్లంతైన ఉద్యోగుల ఆచూకీపై తీవ్ర ఆందోళన నెలకొంది. టన్నెల్ లో ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న 17 మందిలో 8 మంది ఎగ్జిట్ ద్వారానికి దగ్గరగా ఉండటంతో, వారంతా పరుగులు పెడుతూ బయటకు వచ్చేశారు. మిగతా వారు పొగలో చిక్కుకున్నారు. నిన్న రాత్రి 10 గంటల తరువాత ఈ ప్రమాదం సంభవించగా, వారు ఎక్కడ ఉన్నారన్నది ఇంతవరకూ తెలియరాలేదు. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి ఎదురవకపోవడంతో, రాత్రి 2 గంటల నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం లోపలికి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆక్సిజన్ మాస్క్ లు ధరించినప్పటికీ, దట్టమైన పొగలు వారికి అవాంతరంగా నిలిచాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. అయితే, లోపల కొన్ని గదులు కూడా ఉన్నాయని, గల్లంతైన వారిలో ఎవరైనా గదుల్లోకి వెళ్లి, తలుపులు వేసుకుని ఉంటే, వారిని రక్షించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. గల్లంతైన ఉద్యోగులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడం ద్వారా అతిపెద్ద ప్రమాదాన్ని తప్పించామని బాలరాజు వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఉదయం నుంచి ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. సింగరేణి నుంచి భూ గర్భంలో కిలోమీటర్ల కొద్దీ వెళ్లి పనిచేసే నైపుణ్యమున్న సిబ్బంది , ఎన్డీఆర్ఎఫ్ కు సహాయంగా వచ్చాయి. పొగ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. వర్షం పడుతూ ఉండటం, డ్యామ్ నిండుగా నీళ్లు ఉండటం, కరెంట్ సరఫరా నిలిపివేయడంతో గత రాత్రి ఎటువంటి సహాయక చర్యలూ జరుపలేదు. తెల్లారిన తరువాత సహాయక సిబ్బంది లోనికి వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.