SP Balasubrahmanyam: నిలకడగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల!
- బాలు ఇంకా ఎక్మో సపోర్ట్ తీసుకుంటున్నారన్న ఎంజీఎం ఆసుపత్రి
- వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని బులెటిన్ లో వెల్లడి
- ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు లేదని వివరణ
కరోనా చికిత్స పొందుతున్న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తాజా ఆరోగ్యపరిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి ఈ సాయంత్రం బులెటిన్ వెలువరించింది. ఎస్పీ బాలు ఇంకా ఎక్మో సపోర్ట్ తో వెంటిలేటర్ పైనే ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు లేదని, నిలకడగానే వుందని ఆ బులెటిన్ లో తెలిపారు.
బాలు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, విభిన్న వైద్య విభాగాల నిపుణులతో కూడిన తమ వైద్య బృందం అహర్నిశలు బాలు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ఆయన శరీరంలో కీలక అవయవాల స్పందనను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటోందని బులెటిన్ లో వివరించారు. బాలు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.