Sunil Kumar Reddy: 'వలస' కూలీల వెతలపై సునీల్ కుమార్ రెడ్డి సినిమా!
- సామాజికాంశాలతో సినిమాలు చేసే దర్శకుడు
- గతంలో 'సొంత ఊరు', 'గంగపుత్రులు' వంటి సినిమాలు
- 'వలస' షూటింగ్ పూర్తి .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. కొన్నాళ్ల పాటు అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దీని వల్ల చిన్నా పెద్దా అన్ని వర్గాల వారూ కష్టనష్టాలను చవిచూశారు. మరీ ముఖ్యంగా వలస కూలీల వ్యథలు చెప్పనలవి కాదు.
తమ పల్లెల్ని వదిలి.. పొట్ట చేతబట్టుకుని .. పని కోసం సుదూరంలోని పట్నాలకు వలసపోయిన కూలీలు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. వున్న చోట పనులు లేవు.. తినడానికి తిండి లేదు.. ఊరు పోదామంటే ఏ వాహనమూ లేదు. దాంతో లక్షలాది మంది తట్టాబుట్టా సర్దుకుని, పిల్లా పాపలను చంకనెత్తుకుని, వందలాది కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ సొంత ఊళ్లకు ప్రస్థానం సాగించారు. ఈ క్రమంలో వాళ్లు పడిన కష్టాలు చెప్పనలవి కాదు. కొందరు మార్గమధ్యంలోనే కడతేరారు కూడా.
ఇప్పుడీ నేపథ్యంలో తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. దీని పేరు 'వలస'.. టైటిల్ కి తగ్గట్టే వలసకూలీల అగచాట్లను ఇందులో ఆవిష్కరిస్తున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన సామాజికాంశాలను స్పృశిస్తూ రూపొందించిన 'సొంత ఊరు', 'గంగపుత్రులు', 'గల్ఫ్' వంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు సైతం పొందాయి. ఇప్పుడీ చిత్రాన్ని కూడా ఆయన అదే సామాజిక స్పృహతో రూపొందిస్తున్నారు. మనోజ్ నందం, వినయ్ మహాదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగు కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు.