Sinopharm: చైనా కరోనా వ్యాక్సిన్ ధర మామూలుగా లేదుగా!
- రూ.10 వేల వరకు ఉండొచ్చన్న సినో ఫార్మ్
- రూ.550కి ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు!
- అంతకంటే తక్కువ ధరకే ఇస్తామంటున్న భారత్ బయోటెక్
కరోనా వైరస్ కు పుట్టినిల్లయిన చైనా కూడా వ్యాక్సిన్ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. చైనాకు చెందిన సినో ఫార్మ్ సంస్థ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపడుతోంది. సినో ఫార్మ్ చైర్మన్ లి జింగ్ జాన్ మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ ధరపై వివరాలు తెలిపారు. చైనా కరెన్సీలో 1000 యువాన్ల లోపే దీని ధర ఉంటుందని వెల్లడించారు. అంటే భారత కరెన్సీలో ఇది రూ.10 వేల వరకు ఉంటుంది.
ఈ క్రమంలో అమెరికా ఫార్మా దిగ్గజం మోడెర్నా తయారుచేస్తున్న వ్యాక్సిన్ రెండు డోసుల విలువ రూ.2,773, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు కలిపి రూ.550 ఉండొచ్చని ఓ అంచనా. భారత్ లో భారత్ బయోటెక్ తయారుచేస్తున్న వ్యాక్సిన్ అంతకంటే తక్కువ ధరకే లభ్యమవుతుందని ఇప్పటికే ఈ సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో చైనా వ్యాక్సిన్ అన్ని దేశాల వ్యాక్సిన్ల కంటే ముందే మార్కెట్లోకి వచ్చినా సినో ఫార్మ్ చెబుతున్న ధరకు కొనుగోలు చేయడం సామాన్యుడికి పెనుభారమే అవుతుంది.