School: పిల్లల్ని పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు.. ఇప్పట్లో బడులు తెరవొద్దు: కేంద్రాన్ని కోరిన తెలంగాణ
- తల్లిదండ్రులు అభిప్రాయాలు చెప్పాలని కోరిన కేంద్రం
- భౌతికదూరం పాటిస్తూ తరగతుల నిర్వహణ కష్టమని అభిప్రాయం
- అక్టోబరు, నవంబరు వరకు స్కూళ్లు తెరుచుకోవడం కష్టమే
ఇప్పటికిప్పుడు బడులు తెరిచినా విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని, అందుకని ఇప్పట్లో బడులు ప్రారంభించే ఆలోచన చేయవద్దని తెలంగాణ విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖను కోరింది. పాఠశాలలను ఎప్పుడు తెరవాలన్న తల్లిదండ్రుల అభిప్రాయాలను పంపాలంటూ ఇటీవల కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించి పంపాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు బడులు ఇప్పట్లో తెరవడం సురక్షితం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో అత్యధిక శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు సిద్ధంగా లేరని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తల్లిదండ్రులు కరోనా మహమ్మారికి టీకా కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించేలా చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని అభిప్రాయపడింది. ఈ లెక్కన చూస్తే అక్టోబరు లేదంటే నవంబరు వరకు పాఠశాలలు తెరుచుకోకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు పేర్కొంది. అదే జరిగితే సిలబస్‌ను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.