Kim Jong Un: బాధ్యతలను చెల్లెలికి అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్న కిమ్!

Kim Jong Un delegates some powers to sister Kim Yo Jong
  • కీలక అధికారాలను తన వద్ద పెట్టుకుని మిగతా వాటిని చెల్లెలికి అప్పగించిన కిమ్
  • వారసురాలిగా మాత్రం ఎంపిక చేయని వైనం
  • అమెరికా, దక్షిణ కొరియా సంబంధాలను చూసుకోనున్న కిమ్ యో జోంగ్
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌కు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఓ సరికొత్త విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన అధికారాల్లో కొన్నింటిని తన చెల్లెలు కిమ్ యో జోంగ్‌కు అప్పగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కీలకమైన కొన్ని అధికారాలను మాత్రం తన వద్దే పెట్టుకుని విధానాల తయారీ విభాగాలను మాత్రం ఆమెకు అప్పజెప్పి కొంత విశ్రాంతి తీసుకున్నట్టు దక్షిణ కొరియా నిఘా సంస్థ గుర్తించింది. తనకు సంక్రమించిన అధికారాలతో కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియా-అమెరికా, ఉత్తర కొరియా-దక్షిణ కొరియా సంబంధాలను చూసుకోనున్నట్టు సమాచారం. చెల్లెలికి మరికొన్ని బాధ్యతలను కూడా అప్పజెప్పినప్పటికీ వారసురాలిగా మాత్రం ఆమెను ఎంపిక చేయలేదని నిఘా వర్గాలు తెలిపాయి.

కిమ్ జోంగ్ కంటే అతడి సోదరి కిమ్ యో జోంగ్ నాలుగేళ్లు చిన్నది. స్విట్జర్లాండ్‌లో కలిసి చదువుకున్నారు. కిమ్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యురాలు ఆమె మాత్రమే. 2018 నుంచి ఆమె ఉత్తర కొరియాలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు, కిమ్ రాజవంశం నుంచి దక్షిణ కొరియాను సందర్శించిన తొలి వ్యక్తిగానూ కిమ్ యో జోంగ్ రికార్డులకెక్కారు.
Kim Jong Un
North Korea
kim yo jong
south korea

More Telugu News