Revanth Reddy: పోలీసులతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వాగ్వివాదం.. అరెస్టు.. వీడియో ఇదిగో
- శ్రీశైలం ఎడమ గట్టు ప్రమాద స్థలి వద్దకు బయల్దేరిన రేవంత్
- అడ్డుకున్న పోలీసులు
- మండిపడ్డ రేవంత్ రెడ్డి
- కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్న
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పరిశీలనకు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు రవిని పోలీసులు ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు ఉండట్లేదంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ అంతగా ఎందుకు భయపడుతున్నారని రేవంత్ రెడ్డి నిలదీశారు. పోలీసుల సాయంతో తమను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజా స్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆయన అన్నారు. ఘటనాస్థలి వద్దకు తమను పంపకపోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని ఆయన మండిపడ్డారు. కాగా, అగ్నిప్రమాద ఘటనపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలోనే తాము కాంగ్రెస్ నేతల పర్యటనకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు అంటున్నారు.