Interstate Transport: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించొద్దు: రాష్ట్రాలకు కేంద్రం లేఖ
- సరకు రవాణాను కూడా ఆపొద్దు
- జిల్లా అధికారులు ఆంక్షలు విధిస్తున్నట్టు తెలుస్తోంది
- దీని వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది
కోవిడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం క్రమంగా సడలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం మరో ప్రకటన చేసింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలను విధించొద్దని రాష్ట్రాలను, యూటీలను కేంద్రం కోరింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.
కోవిడ్ ఆంక్షల పరిధిలోకి అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకుల రవాణాను తీసుకురావద్దని లేఖలో కోరారు. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, సరుకు రవాణాలపై ఆంక్షలు ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రయాణాలపై జిల్లా స్థాయి అధికారులు ఆంక్షలు విధిస్తున్నట్టు తమకు సమాచారం అందుతోందని తెలిపారు. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు.