SP Balasubrahmanyam: ఎస్పీ బాలుకు చికిత్స కోసం అంతర్జాతీయ వైద్య నిపుణులను సంప్రదిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి
- బాలు పరిస్థితి నిలకడగానే ఉందన్న ఎంజీఎం ఆసుపత్రి
- ఎక్మో సపోర్టు కొనసాగుతోందని వెల్లడి
- తాజా బులెటిన్ విడుదల చేసిన ఆసుపత్రి వర్గాలు
వేలకొద్దీ గీతాలు ఆలపించి కోట్లాది మంది హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఎక్మో సపోర్టు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేశాయి.
ఆయనకు ఎక్మో సపోర్టు సాయంతో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని ఆ బులెటిన్ లో వెల్లడించారు. బాలు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, భిన్న వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని వివరించారు. అంతేకాకుండా, తమ వైద్య బృందం ఈ విషయంలో అంతర్జాతీయ వైద్య నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.
అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఎంతోమంది కరోనా రోగులకు ఎక్మో సపోర్టుతో చికిత్స అందించిన వైద్య నిపుణులతో తమ డాక్టర్లు మాట్లాడుతున్నారని ఎంజీఎం ఆసుపత్రి బులెటిన్ లో పేర్కొంది. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తాము అందిస్తున్న చికిత్స విధానంతో అంతర్జాతీయ వైద్య నిపుణులు కూడా ఏకీభవిస్తున్నారని వెల్లడించింది.