Maharashtra: మహారాష్ట్రలో ఒకే రోజు నాలుగుసార్లు కంపించిన భూమి
- తీవ్రత తక్కువగా ఉండడంతో తప్పిన ఆస్తి, ప్రాణ నష్టం
- ఉదయం 11.39 గంటలకు తొలి ప్రకంపనలు
- సాయంత్రం ఏడున్నర గంటలకు నాలుగోసారి కంపించిన భూమి
మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఒకే రోజు నాలుగుసార్లు భూమి కంపించడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత అతి తక్కువగా నమోదు కావడంతో ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లలేదు. నిన్న ఉదయం 11.39 గంటలకు తొలి ప్రకంపనలు నమోదైనట్టు పాల్ఘర్ జిల్లా డిజాస్టర్ సెల్ అధికారులు తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.8గా నమోదైంది.
సాయంత్రం 5.23 గంటలకు రెండోసారి, ఆ తర్వాత 6.47 గంటలకు మూడోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.1గా నమోదైంది. సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో నాలుగోసారి భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. 2018, 2019 లలో కూడా పాల్ఘర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి పలుమార్లు కంపించినట్టు అధికారులు పేర్కొన్నారు.