Rahul Gandhi: మన్మోహన్, ఏకే ఆంటోనీ.. వీరిద్దరిలో ఒకరిని ఎన్నుకోండి: అధ్యక్ష బాధ్యతలపై రాహుల్ గాంధీ
- సోనియాకు అత్యంత సన్నిహితుడైన ముకుల్ వాస్నిక్ పేరు కూడా తెరపైకి
- ఎవరిని నియమించినా తాత్కాలికమేనన్న ప్రచారం
- పార్టీ ప్లీనరీలో రాహుల్ పూర్తిస్థాయి అధ్యక్షుడవుతాడంటున్న కాంగ్రెస్ వర్గాలు
కాంగ్రెస్‌లో రాజుకున్న నాయకత్వ ముసలంపై రాహుల్ గాంధీ స్పందించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకగాంధీ ఇప్పటికే నిరాకరించడంతో తదుపరి అధ్యక్షుడెవరన్న దానిపై చర్చమొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ మంత్రి, సీనియర్ నేత ఏకే ఆంటోనీ పేర్లను రాహుల్ సూచించినట్టు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ తొలి ప్రాధాన్యం కాగా, ఆయన నిరాకరిస్తే ఏకే ఆంటోనికి బాధ్యతలు అప్పగించాలని రాహుల్ సూచించినట్టు సమాచారం. అయితే, సోనియాకు అత్యంత సన్నిహితుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.
మన్మోహన్, ఏకే ఆంటోనీలలో అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా పూర్తికాలంపాటు వారిని నియమించరన్న ప్రచారం కూడా జరుగుతోంది. తాత్కాలికంగా మాత్రమే వారికి బాధ్యతలు అప్పజెబుతారని పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుత కొవిడ్ సంక్షోభం తొలగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారని, అందులోనే రాహుల్ పూర్తిస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.