North Korea: కోమాలో ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్.. దక్షిణ కొరియా అధికారి సంచలన వ్యాఖ్యలు
- తమ గూఢచర్య వర్గాలు తెలిపాయన్న సౌత్ కొరియా అధికారి
- మరణించలేదు కానీ, కోమాలో ఉన్నారని స్పష్టీకరణ
- గతంలోనూ ఇలాంటి వార్తలే హల్‌చల్
ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లిపోయారంటూ దక్షిణ కొరియా అధికారి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన కోమాలో ఉండడంతో ఉత్తర కొరియాలో ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చూస్తున్నారని గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్‌కు సహాయకుడిగా పనిచేసిన చాంగ్ సాంగ్ మిన్ తెలిపారు. కిమ్ కోమాలోకి వెళ్లిన విషయాన్ని తమ గూఢచర్య వర్గాలు తెలిపాయని పేర్కొన్నారు.
కిమ్ కోమాలో ఉన్నట్టు తెలుస్తోందని, కానీ ఆయన మరణించలేదని చాంగ్ తెలిపారు. ఈ ఏడాది కిమ్ బయట చాలా తక్కువసార్లు కనిపించారని, ఆయన ఆరోగ్యం క్షీణించిందని అన్నారు. ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కిమ్ యో జోంగ్ సిద్ధంగా ఉన్నట్టు చాంగ్ పేర్కొన్నారు. కాగా, కిమ్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్టు గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత కిమ్ ఓసారి బహిరంగంగా కనిపించడంతో ఆ వార్తలకు చెక్ పడింది. ఇప్పుడు మళ్లీ అటువంటి వార్తలే వస్తుండడం గమనార్హం.