Sake Sailajanath: రాహుల్ ముందుకొస్తే.. ఆయనకే బాధ్యతలను అప్పగించాలి: శైలజానాథ్
- దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప నాయకురాలు సోనియా
- రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ నాయకత్వం అవసరం
- దేశ విచ్ఛిన్న శక్తులపై రాహుల్ పోరాటం చేశారు
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మార్పుపై ఈ రోజు జరగనున్న సీడబ్ల్యూసీ మీటింగ్ లో తేలిపోనుంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ లేఖ రాశారు. పార్టీ అధ్యక్షురాలిగా తమరే ఉండాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో పార్టీని గట్టెక్కించిన ఘనత సోనియాది అని శైలజానాథ్ చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడి దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప చరిత్ర ఆమెదని అన్నారు. అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగాలని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో నాయకత్వాన్ని మార్చాలనే ఆలోచన ఉంటే.. రాహుల్ గాంధీ ముందుకొస్తే ఆయనకు బాధ్యతలను అప్పగించాలని కోరారు.
రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ నాయకత్వం అవసరమని శైలజానాథ్ చెప్పారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ పునర్వైభవాన్ని పొందుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. దేశాన్ని మతం, కులం ఆధారంగా విచ్ఛిన్నం చేయాలని కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని... వాటిపై పోరాటం చేయడం ద్వారా రాహుల్ గొప్ప నాయకుడిగా నిరూపించుకున్నారని చెప్పారు.