Nawaz Sharif: నవాజ్ షరీఫ్ పారిపోయిన వ్యక్తి... మాకు అప్పగించండి: బ్రిటన్ ను కోరిన పాక్
- చికిత్స కోసం లండన్ వెళ్లిన పాక్ మాజీ ప్రధాని
- షరీఫ్ బెయిల్ ఎప్పుడో ముగిసిందన్న పాక్
- న్యాయవ్యవస్థకు చెంపపెట్టు అంటూ ప్రధాని సలహాదారు వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవిస్తూ అనారోగ్య కారణాలతో కోర్టు అనుమతిపై లండన్ వెళ్లడం తెలిసిందే. అయితే, తన బెయిల్ సమయం ముగిసినా నవాజ్ షరీఫ్ ఇంకా బ్రిటన్ లోనే ఉండడం పట్ల పాక్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
నవాజ్ షరీఫ్ పారిపోయిన వ్యక్తి అని, ఆయనకు నాలుగు వారాలపాటు బెయిల్ ఇచ్చినా ఇప్పటివరకు తిరిగిరాలేదని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సలహాదారు షాజాద్ అక్బర్ పేర్కొన్నారు. ఈ మేరకు నవాజ్ షరీఫ్ ను అప్పగించాలంటూ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. షరీఫ్ కు ఇచ్చిన బెయిల్ గత డిసెంబరుతోనే ముగిసిందని, ఇప్పటికే బ్రిటీష్ ప్రభుత్వానికి అభ్యర్థన పంపామని అక్బర్ వెల్లడించారు.
కాగా, అత్యవసర చికిత్స కోసం అంటూ లండన్ వెళ్లిన నవాజ్ షరీఫ్ అనేక సందర్భాల్లో లండన్ లో బహిరంగంగా దర్శనమిచ్చారు. ఆయనలో అనారోగ్య ఛాయలేవీ లేకపోగా, ఎంతో ఉల్లాసంగా కనిపించారు. దీనిపైనా అక్బర్ ఘాటుగా స్పందించారు. న్యాయవ్యవస్థకు ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. తీవ్ర అనారోగ్య కారణాలతో ఇచ్చిన బెయిల్ అపహాస్యం అయిందన్న కోణంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.