prashant Bhushan: కోర్టు ధిక్కరణ కేసు.. క్షమాపణకు ప్రశాంత్ భూషణ్ నో
- సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై ప్రశాంత్ భూషణ్ ట్వీట్లు
- దోషిగా తేల్చి క్షమాపణలు చెప్పాలన్న కోర్టు
- అలా చేస్తే తన మనస్సాక్షిని ధిక్కరించినట్టు అవుతుందంటూ అఫిడవిట్
కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ (63) క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా పరిగణించిన న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. ఇందుకు గాను క్షమాపణ చెప్పాలని కోరుతూ మూడు రోజుల గడువు ఇచ్చింది.
కోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుండడంతో ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్లను బోనఫైడ్ చేస్తూ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. తాను క్షమాపణ చెప్పబోనని, అలా చేస్తే కనుక తన మనస్సాక్షిని ధిక్కరించినట్టు అవుతుందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు కానీ, సీజేఐకు కానీ అపకీర్తి తేవాలనేది తన ఉద్దేశం కాదని పేర్కొన్న ప్రశాంత్ భూషణ్.. తన ట్వీట్లు తన నమ్మకానికి సంబంధించినవని, ఒకవేళ తానిప్పుడు క్షమాపణ చెప్పినా అందులో నిజాయతీ ఉండదని స్పష్టం చేశారు.